శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు అభయప్రదానం చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహనసేవ కొనసాగింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ ఉంటుంది. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.