విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లులూ వచ్చేస్తోంది. నగరంలో సువిశాలంగా లులూ గ్రూప్ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్‌ను తీసుకురాబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది.విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను వెంటనే ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎమ్‌ఆర్‌డీఏకి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 2017లోనే లులూకు అప్పటి టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించగా.. వింత కారణాలు చెప్తూ 2023లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ భూముల్ని ‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరుతో నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌బీసీసీ) ద్వారా వేలం వేయాలని గత ఏడాది వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ.. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ భూములు విక్రయించవద్దని కోర్టు స్టే ఇచ్చింది. దాంతో జగన్ ప్రభుత్వం ఆ భూములు వీఎంఆర్‌డీఏకు బదలాయించి.. ఆ సంస్థతో వేలం వేయించి సొమ్ము చేసుకోవాలని చూసింది. కానీ.. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఆ భూములన్నీ వీఎంఆర్‌డీఏ వద్దనే ఉండిపోయాయి.