Current Date: 11 Feb, 2026

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు చెమటలు పట్టించిన నేపాల్.. లాస్ట్ ఓవర్‌‌లో ట్విస్ట్

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అసోసియేట్ (చిన్న) జట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ వంటి జట్లు దిగ్గజ జట్లకు గట్టి పోటీనిస్తూ గెలుపు అంచు వరకు వెళ్తున్నాయి. ఆదివారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో నేపాల్ జట్టు మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. బెతెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), దీపేంద్ర ఐరీ (44) మెరుపులు మెరిపించడంతో ఒక దశలో నేపాల్ 123/2తో పటిష్ట స్థితిలో నిలిచి సంచలన విజయం దిశగా సాగింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి నేపాల్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి 16 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన సమయంలో లోకేష్ బామ్ (39 నాటౌట్) ఆర్చర్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాది మ్యాచ్‌ను మళ్లీ నేపాల్ వైపు తిప్పాడు. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్‌కు 4 పరుగుల స్వల్ప తేడాతో ఊపిరి పీల్చుకునే విజయాన్ని అందించాడు. త్రుటిలో సంచలనం తప్పినప్పటికీ, మేటి జట్టుపై నేపాల్ చూపిన పోరాట పటిమను క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.