Current Date: 08 Feb, 2026

కడపలో ‘ఒరేయ్’ మర్డర్.. ఎక్కడికి పోతోంది సమాజం?

కడప జిల్లా సీకేదిన్నె పరిధిలోని మేరీనగర్‌లో కేవలం "ఒరేయ్" అనే ఒక్క మాట ప్రాణాల మీదకు తెచ్చింది. వాహనానికి లైట్లు లేవని ప్రశ్నించిన వ్యక్తిని ఉద్దేశించి "లేరా" అని సమాధానం ఇవ్వడమే వివాదానికి కారణమైంది. ఈ చిన్న మాట పట్టింపు చివరకు ఒక వ్యక్తి హత్యకు దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. రాత్రి గద్వాల చిన్నసుబ్బరాయుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, లైట్ ఎందుకు వేయలేదని అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ప్రశ్నించాడు. దానికి సుబ్బరాయుడు "లైట్ వెలగట్లేదురా" అని అనడంతో కోపానికి గురైన ఈశ్వరయ్య, రేయ్ అంటావా అంటూ అతనిపై చేయి చేసుకున్నాడు. ఈ గొడవ ముదరడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. కక్ష పెంచుకున్న ఈశ్వరయ్య తన అనుచరులతో కలిసి అర్థరాత్రి మారణాయుధాలతో చిన్నసుబ్బరాయుడి ఇంటిపై దాడికి వెళ్లారు. ఈ దాడిలో నిందితులు చిన్నసుబ్బరాయుడిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా, అతని సోదరుడు పెద్దసుబ్బరాయుడు అడ్డువచ్చాడు. దీంతో కత్తిపోట్లు పెద్దసుబ్బరాయుడికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.