Current Date: 26 Nov, 2024

యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు కేంద్రానికి మరో దెబ్బ

నీట్ 2024 వివాదం నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వానికి మరో ఇబ్బంది ఎదురైంది. యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ లీకేజ్, అవకతవకలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.జూన్ 18వ తేదీన యూనియన్ గ్రాంట్స్ కమీషన్ నెట్ 2024 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. నీట్ 2024 పరీక్షను కూడా ప్రతి యేటా ఇదే ఏజెన్సీ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 1205 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 9 లక్షలుమంది హాజరయ్యారు. జేఆర్ఎప్, పీహెచ్డీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా  కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ నివేదికలు పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రాధమికంగా సమర్ధించాయి. దాంతో యూజీసీ నెట్ 2024 పరీక్ష మొత్తం రద్దు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను సీబీఐకు అప్పగించింది.విద్యార్ధుల భవిష్యత్, పారదర్శకత కోసమే పరీక్ష రద్దు చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. పరీక్ష రద్దు చేయడంతో విద్యార్ధుల్నించి ఆగ్రహం వ్యక్తమౌతోంది.

Share