తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. రాత్రి 7-8 గంటల నుంచే మంచు ప్రభావం మొదలైపోతుండగా.. ఉదయానికి కొన్ని చోట్ల కనీసం 100 మీటర్ల దూరంలో దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. సోమవారం.. మంగళ, బుధవారాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఉన్న వాతావరణం కంటే.. రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఈ వారం నమోదుకానున్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతోపాటు ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటం చలి తీవ్రత పెరగనుంది. చలి ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. రాత్రిళ్లు, ఉదయం అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకపోవడం మంచిదని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.