గతంలో పోలీసులు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ భయపడిపోయే వారు. కానీ.. ఇప్పుడు జనరేషన్‌లో ఆ భయం లేదు. చాలా ధైర్యంగా పోలీసులతో మాట్లాడుతున్నారు. ఫిర్యాదు చేయడానికి భయపడటం లేదు. తరగతి గదిలో తన పెన్సిల్‌ను స్నేహితుడు దొంగిలించాడని కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడు కొన్ని రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేస్తే సిద్దిపేట జిల్లాకు చెందిన బాలుడు తన సైకిల్ చోరీకి గురైందని వెతికి పెట్టాలని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాజాగా 'మా నాన్న నన్ను ఆడుకోనివ్వడం లేదు. ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపండి' అంటూ ఓ ఐదేళ్ల బాలుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'మా నాన్న నన్ను ఇంటి పక్కనే ఉన్న నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు. ఆడుకోవడానికి వెళ్ళనివ్వడం లేదు. రోడ్డు వైపు వెళ్లకుండా ఆపుతున్నాడు. కొడుతున్నాడు' అంటూ పోలీసు అధికారికి బాలుడు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని పోలీసు అధికారిని కోరాడు. బాలుడు పోలీసు అధికారితో మాట్లాడుతున్న సమయంలో స్టేషన్లో ఉన్న కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.