Current Date: 05 Aug, 2026

నకిలీ ట్రేడింగ్ యాప్ మోసం.. రూ.52.16 లక్షల టోకరా

విశాఖపట్నం కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ. 52.16 లక్షలు కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ అంతర్జాతీయ నేరస్థుల ముఠాకు సహకరిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాప్రీ, షేక్ యూసఫ్ మరియు జాకీర్ హుస్సేన్ ఉన్నారు. బాధితుడి వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ విద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ట్రేడింగ్ ద్వారా భారీగా లాభాలు పొందవచ్చని నమ్మించి, ఓ నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఆ తర్వాత విడతల వారీగా బాధితుడి నుంచి రూ. 52.16 లక్షలు డిపాజిట్ చేయించుకుని మోసానికి పాల్పడ్డారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మోసగాళ్లకు సహకరిస్తున్న ఈ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. అధిక లాభాల పేరుతో అపరిచిత వ్యక్తులు పంపే ట్రేడింగ్ యాప్‌లు, లింకులను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరించారు.