తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా వేల్పూరు మండలం అక్సాంపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన 100 రూపాయలు, 500 రూపాయల నోట్లు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. చెట్ల కింద ఆకులు రాలినట్టుగానే.. రోడ్డు పక్కన పరిచినట్టుగా నోట్లు కనిపించాయి. రూపాయో, రెండు రూపాయలో కనిపిస్తేనే కళ్లకద్దుకుని తీసుకునే జనాలు.. 100, 500 రూపాయల నోట్లు కనిపిస్తే ఆగుతారా..? ఎగబడి మరీ ఏరుకున్నారు. ఆ రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు, నడుచుకుంటూ వెళ్లే వాళ్లు తెగ సంబరపడిపోతూ.. ఒకరిని తోసుకుంటూ ఒకరు నోట్లను జేబుల్లో నింపుకున్నారు. ధనలక్ష్మి తలుపు తట్టిందనుకుని.. జేబు నిండా నోట్లతో.. మనసు నిండా సంతోషంతో ఇళ్లకు వెళ్లారు. కానీ.. ఒక్క ట్విస్ట్‌తో సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. రోడ్డుపై దొరికిన నోట్లతో కొంత మంది ఇంటికెళ్లిపోగా.. మరి కొందరు బ్యాంక్‌కి వెళ్లి డిపాజిట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే.. వారికి.. అవి నకిలీ నోట్లు అని సిబ్బంది తేల్చి చెప్పేశారు. దాంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారి మొహం తెల్లబడిపోయింది.