ఏపీలో ఎవరూ ఊహించని ఫలితాల్ని జనం ఇచ్చారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం టీడీపీని దాదాపు ఇలానే ఓటర్లు తిరస్కరిస్తే.. వైసీపీని అంతకు మించి అనేట్లు చిత్తుగా ఓడించారు. చంద్రబాబు ఈ గెలుపునకి కారణాల్ని ఓసారి విశ్లేషిస్తే.. 2019లో వైసీపీలో చేతిలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.కానీ.. చంద్రబాబు అక్కడి నుంచే మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని భావించారు. తన ఓటమికి కారణాల్ని విశ్లేషించుకుంటూ పంతాలు, పట్టింపులకు వెళ్లలేదు. అందరినీ కలుపుకెళ్లాలన్న వ్యూహం... తిరిగి ఆయన్ను విజేతగా నిలబెట్టాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో తన పరాజయానికి కారణమైన పవన్‌కల్యాణ్, బీజేపీతోనూ మళ్లీ స్నేహం చేయడానికి కూడా సంకోచించలేదు. బలం, బలహీనతల్ని గుర్తించడం అంటే ఇది.కానీ.. వైయస్ జగన్ మాత్రం 2019 నుంచి వరుసగా రాజకీయ తప్పిదాలు చేస్తూ వెళ్లారు. చంద్రబాబు, పవన్ కలిస్తే తనకి ప్రమాదం అని తెలిసినా.. అహంకార ధోరణితో పవన్‌ను పదే పదే రెచ్చగొట్టాడు. ఒకవేళ పవన్‌తో జగన్‌కు వ్యక్తిగత లేదా రాజకీయ వైరం లేకుంటే, జనసేన ఒంటరిగా పోటీ చేసేది. కానీ జనసేనను వైసీపీ టార్గెట్ చేయడంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో బీజేపీ జత కట్టేలా చేయడంలో పవన్‌కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ రోజురోజుకీ అందరికీ జగన్ దూరమవగా.. చంద్రబాబు అందరికీ అందుబాటులో ఉంటూ అధికారానికి చేరువైపోయారు.