ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైయస్ జగన్ ఆలోచన శైలిలో మారుతున్నట్లు కనిపిస్తోంది. గత ఐదేళ్లు మొండిగా వ్యవహరించిన జగన్.. గత కొన్ని రోజుల నుంచి వివిధ జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడటం, వారం వారం ప్రెస్మీట్లు నిర్వహించి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ.. మొదట ఇల్లు చక్కదిద్దుకుని.. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సంబంధించి ఆస్తుల వివాదానికి కూడా జగన్ చెక్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. కారణాలు ఏవైనా జగన్ చెల్లెళ్లు షర్మిల, డాక్టర్ సునీత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేశారు. వీళ్లిద్దరి ప్రచారం జగన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొచ్చిందన్నది వాస్తవం. చివరికి తన బిడ్డ షర్మిలను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. జగన్‌కి సొంత కుటుంబంలోనే తీవ్రస్థాయిలో విభేదాలుంటే, ఇక బయట సమాజం ఏ విధంగా ఆదరిస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో షర్మిలతో ఆస్తుల పంపకాలకు సంబంధించి దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.