వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ త్వరలో సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించనున్నారు. రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రవీణ్ ప్రకాశ్ వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును చంద్రబాబు సర్కార్ ఆమోదించింది. జగన్ సర్కార్‌తో ఆయన అంటకాగారని, అందుకే ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించింది.కూటమి ప్రభుత్వం రావడంతోనే ప్రవీణ్ ప్రకాశ్ ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉండగానే, ఆయన ఉన్నతాధికారిగా వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రవీణ్ ప్రకాశ్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన భార్య భావనా సక్సేనా కూడా ఐపీఎస్ అధికారి. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
విద్యాశాఖలో కీలక హోదాలో ప్రవీణ్ ప్రకాశ్ పని చేశారు. ఉపాధ్యాయులను వేధించారనే అపవాదు మూటకట్టుకున్నారు. అందుకే వారికి క్షమాపణ చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు. అయితే రాజకీయాల్లో అక్షర ముక్క రాని వారంతా ప్రవేశించి, తమలాంటి ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులపై పెత్తనం చేయడంపై ప్రవీణ్ అసంతృప్తిగా ఉన్నారు.