రోజ్‌గార్ మేళా ద్వారా లక్షలాది మంది యువతకు భాగస్వామ్యం లభించినట్టయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నిర్వహించిన రోజ్‌గారి మేళా (వీడియో కాన్ఫరెన్స్) సందర్భంగా మంగళవారం ఇక్కడి వీఎంఆర్‌డీఏ మందిరంలో సంజయ్ పాల్గొని 110మందికి ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేశారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారితో కలిసి సంజయ్ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారికి దాదాపు 51236 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పీఎం మోడీ పంపిణీ చేసిన దృశ్యాల్ని ఇక్కడ వీసీలో చూశారు. కొత్తగా ఎంపికైన ఉద్యోగార్థులను అభినందించి, వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. 10 లక్షల మంది నిరుద్యోగ యువతను మిషన్ మోడ్‌లో వివిధ ప్రభుత్వ రంగాల్లోకి చేర్చుకోవడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.