Current Date: 02 Apr, 2025

ఉగాది రోజున ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నం

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి పన్నెండేళ్ల క్రితం ఊరి శివారున తమ పొలంలో భూదేవి ఆలయాన్ని సొంతంగా నిర్మించాడు. ఆ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీసి, వారం రోజుల నుంచి అందులోకి వెళ్లి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు. ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారుడితో కలసి ఆలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం సమాధిలా ఏర్పాటు చేసిన గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అతని కుమారుడు ఆ గొయ్యిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చి వేశాడు. సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో అతనిని బయటకు తీశారు. వారు వెళ్లిన తర్వాత మళ్లీ ఆ గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నవడం గమనార్హం.

Share