ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు తేలడంతో.. వాటిని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల కేటగిరీలో కొన్నివేలమంది అనర్హులు.. సదరం సర్టిఫికేట్ ద్వారా పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అన్ని పింఛన్లను మరోసారి తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపొందించేందుకు 8మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే వెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. పింఛన్ తొలిగించేందుకు 45 రోజుల సమయం తీసుకుని అర్హులకు ఎలాంటి అన్యాయం జరగకుండా నిర్ణయాలు ఉంటాయి. గ్రామసభల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి.. పింఛన్ తొలగిస్తే వారు ఫిర్యాదు చేయగానే (మరో అవకాశం) పరిశీలించి సరిచేస్తారు.