రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం బారాముల్లా జిల్లాలో భూమికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. మరో 7 నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూంకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. రెండు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.