Current Date: 27 Nov, 2024

రైతుల పేరుతో డబ్బులు కొట్టేసిన ఎమ్మార్మో

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు సృష్టించిన ఎమ్మార్వో భారీగా డబ్బులు కాజేసింది.కింది స్థాయి ఉద్యోగి సహాయంతో డబ్బులు కాజేసింది. ఈ మేరకు తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హుజూర్ నగర్ తహసీల్దారుగా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులు స్వాహా చేసినట్లు తేలింది. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019లో ఎమ్మార్వో జయశ్రీ పట్టాదారు పాసుబుక్‌లు జారీ చేసింది.అనంతరం రైతు బంధు నిధులు కాజేసి తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున పంచుకున్నట్లు తేలింది. ఎమ్మార్వోపై అవినీతి ఆరోపణలు రావటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

Share