నిష్కామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 25 వరకు ఏయూ నార్త్ క్యాంపస్ లోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శ్రీ శంకరాచార్యుల వారు రచించిన భజగోవిందంపై ఉపన్యాసాలుంటాయని ఆ సంస్థ కోశాధికారి కె. భారతి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రోజూ సాయంత్రం 5.30నుంచి 6గంటల వరకు భజనలు, 6 నుంచి 7.15వరకు ప్రవచనాలు జరుగుతాయన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అరుణజీ భజగోవిందం 31 శ్లోకాల్లోని 31సూక్తులు, జీవన విధానాల్ని ప్రవచనాల ద్వారా చెబుతారని, శంకరాచార్యులు తమ ప్రభోదాల ద్వారా నిత్య జీవితంలో మోహాల నుంచి విముక్తి చెందే మార్గాల్ని, అరుణజీ ప్రతి శ్లోకాన్ని స్పష్టంగా, సునిశితంగా ఉదాహారణలతో వివరించడం అందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తమ సంస్థ ద్వారా మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సాయం కోరిన వారికి చేయూత, అన్న వితరణ వంటి సామాజిక, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు భారతి తెలిపారు. సంస్థ ప్రతినిధి ఎం. అనూరాధ మాట్లాడుతూ విశాఖ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచనాల ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలన్నారు.