ప్రధాని నరేంద్ర మోడీ ఓ పెద్ద నటుడు. ఆయనకు ప్రజలకు మభ్యపెట్టడం మినహా దేశ భవిష్యత్తు అవసరం లేదని తిరుపతి మాజీ ఎంపీ చింతామెహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నరేంద్ర మోడీ తప్పదారి పట్టించారన్నారు. ప్రధాని గురించి ఇన్నాళ్లూ ఎవరికీ తెలియని విషయం తానిప్పుడు చెబుతున్నానని, మోడీకి పెద్ద స్టూడియా ఉందన్నారు. ఆ స్టూడియోలో ఫోటోలు, పలు వీడియోలు రూపొందించి ప్రజల్లోకి వదులుతుంటారని, ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలన్నదే నిరంతరం మోడీ లక్ష్యమన్నారు. రోజుకు కనీసం గంట ఆ స్టూడియోలో మేకప్ వేసుకొని మాయమాటలు, ఆకట్టుకునే వీడియోలు రూపొందింస్తుంటారన్నారు. ఇందుకోసం మోడీ రోజుకు ఇరవై వేలు మేకప్ కోసమే ఖర్చు చేస్తుంటారని చింతా మోహన్ ఆరోపించారు. ఇదంతా ప్రజల ధనమే అన్నారు. మోడీ హయాంలో మీడియాకు సంకెళ్లు పడ్డాయన్నారు. అందుకే ఇలాంటి విషయాలను ఏ మీడియా సాహసించి రాయలేక పోతోందన్నారు. మీడియాను అణగదొక్కిన ఏకైక భారత ప్రధాని మోడీ అన్నారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు హయాంలో మీడియాకు స్వేచ్ఛ ఉండేదన్నారు. తమపై అనేక ప్రతికూల కథనాలు వచ్చినా ఆ ఇద్దరూ ఏనాడూ పత్రికా స్వేచ్ఛను హరించే యత్నం చేయలేదన్నారు. కానీ మోడీ మీడియాపై ఉక్కుపాదం మోపారన్నారు. సేరు బియ్యం కొనుకునేందుకు వంద రూపాయలు కూడా లేని ధైన్యస్థితిలో దేశంలో ఎందరో ఉన్నారని, కానీ మోడీ మాత్రం వందల కోట్ల ప్రజాధనాన్ని తన మేకప్ కోసమే వృథా చేస్తున్నారని చింతామోహన్ మండిపడ్డారు.