మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. వడోదర వేదికగా గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. జెమీమా రోడ్రిగ్స్ (57), లారా వోల్వార్ట్ (44) రాణించడంతో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరుసగా ఐదోసారి ఫైనల్ ఆశలతో బరిలోకి దిగిన ఢిల్లీకి, ఆర్సీబీ బ్యాటర్ల విధ్వంసం కోలుకోలేని దెబ్బ తీసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు కెప్టెన్ స్మృతి మంధాన (87), జార్జియా వోల్ (79) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 92 బంతుల్లోనే 165 పరుగులు జోడించి ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. స్మృతి కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి తన క్లాస్ చూపించగా, వోల్ ఫోర్ల వర్షం కురిపించింది. వీరిద్దరి ధాటికి మ్యాచ్ పూర్తిగా బెంగళూరు వశమైందనిపించినా, ఆఖర్లో వరుస వికెట్లతో ఢిల్లీ గట్టి పోటీని ఇచ్చింది. చివరి మూడు ఓవర్లలో 27 పరుగులు అవసరమైన తరుణంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కీలక సమయంలో స్మృతి, రిచా ఘోష్ అవుట్ కావడంతో టెన్షన్ పెరిగినా, రాధా యాదవ్ ఆఖరి ఓవర్లో వరుస బౌండరీలతో జట్టును విజ తీరాలకు చేర్చింది. 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ సంబరాల్లో మునిగిపోగా, వరుసగా ఫైనల్స్ ఓడిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ టైటిల్ గెలవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు 18 ఏళ్లు పట్టింది. కానీ ఆర్సీబీ మహిళల జట్టు రెండేళ్ల వ్యవధిలో రెండు కప్పులు గెలవడం గమనార్హం.
Share