ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అదిరిపోయే ప్రదర్శనతో రికార్డుల మోత మోగించేస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 287 పరుగులు చేసిన హైదరాబాద్ టీమ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సీజన్‌లోనే 260 ప్లస్ స్కోరుని హైదరాబాద్ చేయడం ఇది రెండోసారి.
మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. దాంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 287 రన్స్ చేయగలిగింది. అనంతరం ఛేదనలో బెంగళూరు టీమ్ కూడా గట్టి పోటీని ఇచ్చినా.. చివరికి 262 రన్స్‌కే పరిమితమైంది. మ్యాచ్‌లో బెంగళూరు ఓడినప్పటికీ.. ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్ అత్యధిక పరుగులు చేసిన టీమ్‌గా నిలిచింది.
ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ టీమ్ నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఆరో ఓటమితో బెంగళూరు టీమ్ చిట్టచివరి స్థానానికి పడిపోయింది.