Current Date: 20 Jun, 2026

మా అత్త సచ్చిపోయేలా చూడు స్వామి.. రూ.20 నోటుపై రాసి హుండీలో వేసిన కోడలు

మా అత్త త్వరగా చచ్చిపోయేలా చూడు స్వామీ... అంటూ ఒక మహిళా భక్తురాలు దేవుడి హుండీలో వేసిన వింత కోరిక నెటిజన్లను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది హుండీలోని డబ్బులను లెక్కిస్తుండగా, ఒక రూ.20 నోటుపై ఏదో రాసి ఉండటం వారి దృష్టిని ఆకర్షించింది. ఆ నోటుపై ఏం రాసి ఉందోనని అక్కడి సిబ్బంది ఆసక్తిగా చదివి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దానిపై సదరు భక్తురాలు.. "స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. తొందరగా మా అత్త చచ్చిపోయేలా చూడు" అంటూ తన మనసులోని ఆవేదనను, కోరికను పెన్నుతో రాసి హుండీలో వేసింది. అత్తగారి పెట్టే కష్టాలను భరించలేకే ఆ కోడలు ఇలా దేవుడికి విన్నవించుకుందని అక్కడి వారు భావిస్తున్నారు. రూ.20 నోటుపై రాసిన ఈ వింత ప్రార్థనను చూసి హుండీ లెక్కిస్తున్న సిబ్బంది, ఆలయ అధికారులు ఆశ్చర్యపోయారు. అత్త వేధింపుల గురించి ఇలా హుండీలో రాసి వేశారంటే అది కచ్చితంగా ఓ మహిళా భక్తురాలి పనే అయి ఉంటుందని వారు చర్చించుకున్నారు. ఈ వింత కోరికను చూసి బాధపడాలో, నవ్వాలో తెలియక అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.