ఏపీ రాజధాని అమరావతిలో నేడు, రేపు, డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేశ్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. డ్రోన్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర డ్రోన్ ముసాయిదా విధానం ఆవిష్కరిస్తారని తెలిపారు. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ లక్ష్యమని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ బెరం పార్కులో డ్రోన్ షో ఉంటుందని సురేశ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం, శాంతిభద్రతల అంశాల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో డ్రోన్ ఎకో సిస్టమ్ తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.