Current Date: 08 Feb, 2026

గొంతులో 15 రోజులుగా జలగ తిష్ట.. డాక్టర్లకు తప్పని తిప్పలు

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. 55 ఏళ్ల వ్యక్తి గొంతులో గత 15 రోజులుగా నివాసముంటున్న ఒక బతికున్న జలగను వైద్యులు అత్యంత చాకచక్యంగా బయటకు తీశారు. సిర్మౌర్ జిల్లాకు చెందిన సురేశ్ దత్ అనే వ్యక్తి శ్వాసనాళం దగ్గర ఈ జలగ ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. సురేశ్ దత్ గత రెండు వారాలుగా గొంతులో అసౌకర్యంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లారు. అతనికి బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించిన వైద్యులు, గొంతు లోపల బతికున్న జలగ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బహుశా అడవి ప్రాంతాల్లోని నీటిని తాగినప్పుడు లేదా శుభ్రం లేని ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులోకి వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైద్యులు వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి, ఎంతో జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి ఆ జలగను ప్రాణాలతో బయటకు తీశారు. ప్రస్తుతం బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారని, గొంతు సమస్య నుంచి ఉపశమనం లభించిందని వైద్యులు తెలిపారు.