రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ దశలో ఉండగానే భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా ₹115 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్, 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని వెచ్చించాయి. కేవలం డిజిటల్ హక్కులే కాకుండా, ఆడియో పరంగా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఆడియో హక్కులు సుమారు ₹18 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇంకా శాటిలైట్ హక్కుల అమ్మకాలు జరగాల్సి ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేస్తుండటంతో, హిందీ శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వెరసి, సినిమా విడుదలవకముందే నాన్-థియేట్రికల్ రూపంలోనే ₹150 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండటం ప్రాజెక్టుపై మరింత హైప్ పెంచింది. సినిమా నిర్మాణానికి కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే ఏడాది ఏప్రిల్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియడ్ డ్రామా థియేట్రికల్ రన్ లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Share