రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమింపబడి నగరానికి విచ్చేసిన ఆయన మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ జరగదన్నారు. దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా మార్చేసిందని, కానీ తాము ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. రాజకీయ వేధింపుల్లో 3 వేల మందిపై జగన్ సర్కారు బైండ్ ఓవర్ కేసులు, ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేసిందని వారికి వందరోజుల్లో విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్లను ఒక ట్రస్ట్‌గా మార్చి నిర్విరామంగా కొనసాగేలా చూస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి శరవేగంగా పనులు మొదలయ్యాయని, ఏడాదిన్నర లోపు అమరావతికి రూపురేఖలుతెస్తామని తెలిపారు.