వాహ సమయంలో మహిళకు తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బు, బంగారం.. ఆమెకు మాత్రమే చెందుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిని తీసుకునే హక్కు భర్తకు గానీ, అత్తింటివారికి గానీ ఉండదని తేల్చి చెప్పింది.
కేరళకు చెందిన ఓ మహిళ పెళ్లి అయిన తొలి రాత్రే ఆమెపై ఉన్న 89 గ్రాముల బంగారం, ఆమె తండ్రి ఇచ్చిన రూ.2 లక్షల చెక్‌ను భర్త తీసుకున్నాడు. అయితే వాటిని భద్రపరుస్తానంటూ చెప్పి తీసుకుని.. వారికి అంతకుముందే ఉన్న అప్పులు తీర్చేందుకు ఆ బంగారం, డబ్బును ఉపయోగించుకున్నారు. దీనిపై ఆ మహిళ.. తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులు, నగలను.. తన భర్త, అత్త తీసుకుని వారికి ఉన్న అప్పులను తీర్చేశారని కోర్టుకు ఎక్కింది.
ఈ కేసులో 2011 లో ఓ ఫ్యామిలీ కోర్టు.. ఆ మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమె డబ్బులు, నగలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును భర్త, అత్తింటివారు కేరళ హైకోర్టులో దాఖలు చేయగా.. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భార్యకు చెందిన ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని తేల్చి చెప్పింది. ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలంటూ ఆ భర్తను ఆదేశించింది.