తిరుపతి డీఎస్పీనని నమ్మించి పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసి ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు కొండూరురెడ్డి వెంకట్రాజు ఎలియాస్ కేవీపీ రాజును అరెస్ట్ అయ్యాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన నిందితుడు గతంలో తిరుపతిలోని ఒక బ్యాంకులో పనిచేసేవాడు. ఆ సమయంలో తిరుపతి డీఎస్పీగా ఉన్న అధికారితో పరిచయం ఏర్పడటంతో, పోలీసులకు సమాజంలో లభించే గౌరవాన్ని చూసి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. అందుకోసం బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి, పోలీసు యూనిఫాం కుట్టించుకోవడమే కాకుండా నకిలీ ఐడీ కార్డుతో తిరుపతి డీఎస్పీనంటూ చలామణి అయ్యాడు. నెల్లూరులోని ‘ట్రేడ్ ప్రాఫిట్ కంపెనీ’ పేరిట వెలిసిన సంస్థలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ మాయమాటలు చెప్పి తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్‌లలో పలువురిని మోసగించాడు. 2021లో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసిన నిందితుడు, బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబంతో సహా బెంగళూరుకు మకాం మార్చాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కేవీపీ రాజు కోసం సీసీఎస్ పోలీసులు ఐదేళ్లుగా తీవ్రంగా గాలిస్తున్నారు. చివరకు ఐదేళ్ల క్రితం నిందితుడు ఉపయోగించిన ఫోన్ నంబర్ కాల్ డేటాను విశ్లేషించగా, అందులోని ఒక నంబర్‌ను అతడి భార్య ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఆధారంతో పోలీసు బృందం బెంగళూరులోని నిందితుడి నివాసానికి చేరుకుంది. మొదట పోలీసులు రాగానే తన పేరు కేవీపీ రాజు కాదంటూ బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ, అధికారులు పక్కా ఆధారాలతో పాటు అతడి ఫొటోను చూపించడంతో నిందితుడు మౌనం వహించి లొంగిపోయాడు.