కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. బాలిక అడవి జంతువులు లేదా కొండచిలువల బారిన పడిందా అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
తోట, కొండ ప్రాంత సరిహద్దుల్లోని ఇనుప కంచె వద్ద బాలికను పోలిన రెండు బొమ్మలను ఉంచి, వాటిలో మాంసాహారాన్ని పెట్టారు. ఆ వాసనకు అడవి జంతువులు ఆకర్షితమై వస్తాయనే అంచనాతో చుట్టూ కెమెరాలు అమర్చి పర్యవేక్షిస్తున్నారు. అలాగే అర్ధరాత్రి, తెల్లవారుజామున అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టడానికి థర్మల్ డ్రోన్లు, రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించే ప్రత్యేక కెమెరాలను రంగంలోకి దించారు.
ప్రమాదవశాత్తూ చిన్నారి అడవిలోకి వెళ్లిందా అనే దిశగా ఇప్పటికే స్థానిక పోలీసులు 6 కిలోమీటర్ల పరిధిలో, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల మేర గాలించినట్లు వెల్లడించారు. చిన్నారి ఇనుప కంచె దాటిన తర్వాత ఎవరైనా దుండగులు ఎత్తుకెళ్లి ఉండవచ్చనే అనుమానంతో మరో రెండు పోలీస్ బృందాలు కేడీపేట వరకు వెళ్లి గాలింపు చేపడుతున్నాయి.