Current Date: 04 Jun, 2026

రామ్‌చరణ్ ‘పెద్ది’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో, జాన్వీకపూర్ కథానాయికగా వచ్చిన ‘పెద్ది’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే.. ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు లేని విజయనగరం జిల్లాలోని ఓ ‘కొండ కింద ఊరు’ నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరి రక్షణ కోసం, అక్కడి మనుషుల ఆత్మగౌరవం కోసం ఆ ఊరి యువకుడైన పెద్ది (రామ్‌చరణ్) చేసిన పోరాటమే ఈ సినిమా కథ. క్రికెట్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ 'ఆట కూలీ'గా పేరు తెచ్చుకున్న పెద్ది, తన ఊరి కోసం ఆ క్రికెట్‌ను వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? రెండు వేర్వేరు క్రీడలను కలిపి ఆడే 'క్రాస్ ఓవర్ అథ్లెట్'గా అతనెలా అవతరించాడన్నదే ఈ చిత్రంలోని ప్రధానాంశం.మితిమీరిన హీరోయిజం జోలికి పోకుండా, ఒక క్రీడాకారుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని కథలో భాగంగానే దర్శకుడు ఆవిష్కరించాడు. ప్రథమార్ధంలో పెద్ది పరిచయం, అతను ఆడే సరికొత్త క్రికెట్ షాట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హీరోయిన్ ట్రాక్, రాజకీయ ఎత్తుగడల వల్ల కథ కాస్త పక్కదారి పట్టినట్లు అనిపించినా... అప్పలసూరి (జగపతిబాబు) పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు, విరామానికి ముందు వచ్చే రెండు బలమైన ఘట్టాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ద్వితీయార్ధంలో కుస్తీ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాల కొరియోగ్రఫీ, క్రికెట్‌-కుస్తీల కలయికతో మైదానంలో హీరో చెలరేగిపోయే తీరు ప్రేక్షకులకు పైసా వసూల్ అనుభూతినిస్తాయి. ఆసుపత్రి సన్నివేశాలు, పతాక ఘట్టాలు భావోద్వేగాలతో హృద్యంగా సాగుతాయి. ఒక ఆట నుంచి మరో ఆటకు మారే క్రమంలోని సంఘర్షణను మరింత లోతుగా చూపించి ఉంటే బాగుండేదనిపించినా, కొన్ని పాత్రల మార్పులో లాజిక్ మిస్ అయినా... కమర్షియల్ హంగులతో కూడిన ఒక అర్థవంతమైన, సరికొత్త స్ఫూర్తిదాయక చిత్రంగా ‘పెద్ది’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది.