Current Date: 17 Jun, 2026

భారత్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య గొడవపెట్టిన అంపైర్.. వీధి రౌడీల్లా వాగ్వాదం

భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే మ్యాచ్ అత్యంత ఉత్కంఠతో పాటు తీవ్ర వివాదాలకు దారితీసింది. అంపైర్ల నిర్ణయాలు పదే పదే భారత్‌కు వ్యతిరేకంగా రావడంతో కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక దశలో భారత ఆటగాళ్లు మ్యాచ్‌ను బహిష్కరించి మైదానాన్ని వీడటానికి సిద్ధమవగా, అధికారులు నచ్చజెప్పి వెనక్కి తీసుకువచ్చారు. మ్యాచ్ చివర్లో శ్రీలంక ఆటగాడు హలంబాగేతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర వాగ్వాదానికి దిగడం, ఒకరినొకరు తోసుకునే పరిస్థితి రావడంతో మైదానంలో ఆటగాళ్ల మధ్య ఆవేశకావేశాలు తారస్థాయికి చేరాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక బ్యాటర్ సదీర సమరవిక్రమ (93) పోరాటంతో లక్ష్యం వైపు దూసుకెళ్లింది. అయితే ఆఖరి ఓవర్లో అర్షద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి లంకను కట్టడి చేశాడు. చివరి బంతికి శ్రీలంక రనౌట్ అవ్వడంతో మ్యాచ్ 265 పరుగుల వద్ద టై అయింది. అయితే, లంక బ్యాటర్ షాట్ ఆడే ప్రయత్నం చేయకపోయినా లెగ్ బై ఇవ్వడంపై తిలక్ వర్మ చేసిన వాదనను అంపైర్లు తోసిపుచ్చారు. వెలుతురు మందగించినా అంపైర్లు సూపర్ ఓవర్‌కు అనుమతించారు. సూపర్ ఓవర్లో అర్షద్ వేసిన బంతుల్లో వైడ్, నో బాల్ వంటి వివాదాస్పద నిర్ణయాల నడుమ శ్రీలంక 16 పరుగులు చేసింది. చీకటి పడుతున్న వేళ 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మథులాన్ వేసిన ఓవర్లో కేవలం 9 పరుగులే చేయగలిగింది. దీంతో శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, లంక ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలర్ విప్రాజ్ రెండు సార్లు పిచ్‌పై పరిగెత్తాడనే కారణంతో అంపైర్లు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ విధించడం కూడా ఈ మ్యాచ్‌ తీవ్ర రసాభాసగా మారడానికి ఒక కారణమైంది.