రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లీకులు, పైరసీని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, సినిమా దృశ్యాలు, పాటలను ఇంటర్నెట్లో అప్లోడ్ లేదా కాపీ చేయడాన్ని నిరోధిస్తూ కోర్టు మేకర్స్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య, ప్రతికూల ప్రచారాలపై కూడా చిత్ర బృందం కఠిన చర్యలకు దిగింది. కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ మీడియా యాక్టివిటీస్‌పై పెద్ది మూవీ టీమ్ ప్రత్యేక నిఘా ఉంచింది. విడుదలకు ముందే సినిమాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మేకర్స్ అన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నారు. సంక్రాంతికి విడుదలైన చిరంజీవి ‘మన శంకర్‌ప్రసాద్’ సినిమా విషయంలోనూ చిత్ర యూనిట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంది. దాంతో ఆ సినిమాపై నెగటివ్ ప్రచారం తగ్గి.. భారీగా వసూళ్లను రాబట్టింది. దాంతో పెద్ది టీమ్ కూడా అదే ఫాలో అవుతోంది.