ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. గార్వేర్ స్టేడియంలో గురువారం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి ఓపెనర్‌గా వచ్చాడు. కాసేపు బ్యాటింగ్ సజావుగానే చేశాడు. ఓ బౌండరీ సైతం బాదాడు. అనంతరం తన చాతీలో నొప్పిగా ఉంది అంటూ సహచరుడికి చెప్పాడు. పిచ్‌పైనే కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించాడు. డగౌట్‌లోని వారికి హెల్మెట్ తేవాలంటూ సైగ చేశాడు. ఛాతీతో పాటు చేయి ఎడమచేయిలో కూడా నొప్పిగా అనిపించడంతో అంపైర్లకు ఈ విషయాన్ని చెప్పాడు. అంపైర్లతో పాటు ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు తన పరిస్థితి వివరించాడు. మైదానాన్ని వీడేందుకు సిద్ధం అయ్యాడు. కొన్ని అడుగులు వేయగానే మైదానంలోనే అతడు కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఇమ్రాన్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
Share