Current Date: 29 Nov, 2024

మంత్రి కొండా సురేఖకి కోర్టు నోటీసులు.. కేసులో నాగార్జున పైచేయి!

అక్కినేని నాగార్జునపై అతని మాజీ కోడలు సమంతాపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెపై కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు. నాగార్జున వేసిన పిటిషన్‌ను కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది. అంటే, సదరు కేసులో తప్పు జరిగిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. నాగార్జున వేసిన పిటిషన్ ఆధారంగా, మంత్రికి సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. అప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు.. 12వ తేదీన తగు సమాధానంతో మంత్రి విచారణకు హాజరుకావాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని ఆమె తరఫున లాయర్ కోర్టుకి విన్నవించగా.. నాగార్జున కుటుంబం అనుభవించిన క్షోభ ముందు ఆమె క్షమాపణలు ఏపాటికి? అంటూ నాగార్జున తరఫు లాయర్ వాదించారు. దాంతో కోర్టు కూడా ఏకీభవించింది.

Share