Current Date: 22 Feb, 2026

పోలీసులు చెప్పినా వినకుండా.. కేటుగాళ్ల చేతిలో మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి

విజయవాడలో 'డిజిటల్ అరెస్ట్' పేరుతో జరిగిన ఒక వింతైన మోసం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో పనిచేసి రిటైర్ అయిన ఒక 65 ఏళ్ల వ్యక్తికి ఈడీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీపై కేసులు ఉన్నాయని, యూనిఫాంలో ఉండి వీడియో కాల్ ద్వారా బెదిరించి కేసు మాఫీ చేయాలంటే రూ. 72.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ఆయన తన ఎఫ్‌డీలను రద్దు చేసి డబ్బు బదిలీ చేసేందుకు బ్యాంకుకు వెళ్లారు. కానీ, విషయం తెలుసుకుని  బ్యాంకు అధికారులు, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. "డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని, అది ఒక మోసమని" ఆయనకు పోలీసులు చిలక్కి చెప్పినట్లు వివరించి, అవగాహన కల్పించి పంపించారు. ఆ సమయంలో కోల్‌కతాకు చెందిన సదరు మోసగాళ్ల ఖాతాకు జరగాల్సిన లావాదేవీని పోలీసులు నిలిపివేసి, ఆయన సొమ్మును కాపాడారు. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కానీ, 15 రోజుల తర్వాత మోసగాళ్లు మళ్లీ కాల్ చేయడంతో ఆ వృద్ధుడు భయపడి పోలీసుల మాటలను పక్కన పెట్టారు. తాము బెంగళూరుకు మారిపోతున్నామని బ్యాంకు సిబ్బందిని నమ్మించి, తన ఎఫ్‌డీ మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలోకి మార్చుకున్నారు. అనంతరం మరో బ్యాంకు ద్వారా నేరగాళ్ల ఖాతాకు రూ. 49 లక్షలు బదిలీ చేశారు. సిబ్బంది అనుమానంతో ప్రశ్నించినా, తెలిసిన వారికే పంపుతున్నానని నమ్మబలికారు. చివరకు నాలుగు రోజుల తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.