బాపట్ల జిల్లా పర్చూరు మండల కేంద్రంలో వైద్యం మాటున సాగుతున్న ఓ నకిలీ డాక్టర్ నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి అనుమతులు, కనీస అర్హతలు లేకపోయినా ఓ వ్యక్తి ఏకంగా కార్పొరేట్ తరహాలో బెడ్‌లు వేసి మరీ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా స్థానికంగా హోటల్, టీ దుకాణం నడుపుతున్న ఈ వ్యక్తి, గతంలో చిన్నచిన్న రోగాలకు మందులు తెచ్చి ఇస్తూ కాలం వెళ్లదీశాడు.
ఏడాది కిందట తన టీ దుకాణానికి సమీపంలోనే ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని, అందులో పడకలు, చికిత్సా సామగ్రిని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి ఆసుపత్రినే తెరిచేశాడు. ఈ నకిలీ డాక్టర్ దినచర్య అంతా విచిత్రంగా సాగుతోంది.
తెల్లవారుజామునే లేచి తన టీ దుకాణం వద్ద వ్యాపారం ముగించుకుని, ఉదయం కాగానే చల్లగా డాక్టర్ అవతారమెత్తి ఆసుపత్రి భవనానికి చేరుకుంటాడు. అక్కడకు వచ్చే అమాయక రోగులకు తానే పెద్ద వైద్యుడిలా చలామణి అవుతూ చికిత్సలు అందిస్తున్నాడు. ఇతని డ్యూయల్ రోల్ వ్యవహారం విపరీతంగా వైరల్ కావడంతో ఈ దందా కాస్తా వెలుగులోకి వచ్చింది.