ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ విశాఖపట్నం శాఖ వైజాగ్ kgh ప్రాంగణంలో చేపట్టిన ఆందోళనకు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విశాఖపట్నం శాఖ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా ఐఎంఏ విశాఖపట్నం శాఖ సభ్యులు కేజీహెచ్ ప్రాంగణంలో జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి, వారి ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ విశాఖపట్నం శాఖతో పాటు ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా జూనియర్ డాక్టర్లకు అండగా ఉంటుందని ima ప్రతినిధులు తెలిపారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా వైద్యులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు, వైద్యుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి (బర్నౌట్) సమస్యను పరిష్కరించేందుకు, మిక్సోపతి (వివిధ వైద్య విధానాల అనుచిత మిశ్రమ వినియోగం), క్వాకరీ (అర్హత లేని వ్యక్తుల వైద్యచర్యలు) వంటి సమస్యలపై కూడా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఐఎంఏ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ విశాఖపట్నం శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.వి.వి. మురళీమోహన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్. బాపారావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వై.ఎల్. నరసింగరావుతో పాటు ఐఎంఏ విశాఖపట్నం శాఖ సభ్యులు పాల్గొని జూనియర్ డాక్టర్లకు తమ సంఘీభావాన్ని తెలిపారు.
Share