Current Date: 26 May, 2026

కోహ్లీతో గొడవపడిన ఆస్ట్రేలియా క్రికెటర్ భార్యకు వేధింపులు

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చోటుచేసుకున్న మాటల యుద్ధం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో, హెడ్ చేతిని చాచినప్పటికీ కోహ్లి అతడిని పట్టించుకోకుండా దాటి వెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లి మద్దతుదారులైన కొందరు అభిమానులు హద్దులు మీరి ఆన్‌లైన్ వేదికగా ట్రావిస్ హెడ్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు, దూషణలకు దిగారు.ఈ ఆన్‌లైన్ దాడిపై ట్రావిస్ హెడ్ భార్య జెసికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలు అసభ్యకరమైన కామెంట్లతో నిండిపోతున్నాయని, కొంతమంది వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సైతం లక్ష్యంగా చేసుకుని తిడుతున్నారని ఆమె వాపోయారు. క్రీడల్లో భావోద్వేగాలు సహజమే అయినప్పటికీ, ఆట వెనుక నిజమైన వ్యక్తులు, వారి కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె హితవు పలికారు.ఈ సైబర్ వేధింపుల పర్వం తనకు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాతి చేదు అనుభవాలను గుర్తుకు తెస్తోందని జెసికా పేర్కొన్నారు. నాడు భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించినప్పుడు కూడా తమ కుటుంబం ఇలాంటి తీవ్రమైన దూషణలనే ఎదుర్కొందని ఆమె గుర్తు చేశారు.