Current Date: 06 Mar, 2026

ఈరోజు ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో భారత్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్

టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో నేడు ముంబైలోని వాంఖెడే మైదానంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. గత రెండు సెమీఫైనల్స్‌లోనూ (2022, 2024) ఈ రెండు జట్లే తలపడగా, ప్రస్తుతం మూడోసారి కూడా సెమీస్‌లోనే ముఖాముఖికి సిద్ధమవ్వడం విశేషం. తాజా టోర్నీలో ఇరు జట్లు అక్కడక్కడా తడబడినప్పటికీ, అసలైన నాకౌట్ సమరంలో మాత్రం సత్తా చాటాలని చూస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్‌ మధ్య 29 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 17 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లాండ్‌పై జరిగిన టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో వీరవిహారం చేశాడు. ఆ మధుర జ్ఞాపకంతోనే ఈ యువ ఓపెనర్ నేటి మ్యాచ్‌లో చెలరేగాలని చూస్తున్నాడు. అతనికి తోడుగా సంజు శామ్సన్ ఫామ్‌లోకి రావడం, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివం దూబేల మెరుపులు జట్టుకు భారీ స్కోరును అందించే అవకాశం ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కూడా మూడో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వంటి బౌలర్లతో ఇంగ్లాండ్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే స్వదేశంలో ఆడుతున్న టీమిండియాను కట్టడి చేయడం వారికి సవాల్‌తో కూడుకున్నదే. ముఖ్యంగా బుమ్రా, అర్ష్‌దీప్‌ల ఆరంభపు ఓవర్లు, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌ను ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్ ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.