Current Date: 24 Feb, 2026

వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్ ఆశలు గల్లంతు? లక్ కలిసొస్తే తప్ప!

డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీ20 ప్రపంచకప్‌ వేట ప్రారంభించిన టీమిండియా అనూహ్య ఓటమితో సెమీస్ ఆశల్ని సంక్లిష్టంగా మార్చుకుంది. రెండు నెలల ముందు భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా, ఆదివారం రాత్రి సూపర్-8 మ్యాచ్‌లో రివేంజ్ తీర్చుకుంది. వాస్తవానికి మ్యాచ్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా, అహ్మదాబాద్ వంటి కఠినమైన పిచ్‌పై 187 పరుగులు చేయడం ఆ జట్టు పట్టుదలకు నిదర్శనం. భారత బౌలర్లు పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడంలో విఫలం కాగా, ఫీల్డింగ్‌లోనూ లోపాలు ప్రత్యర్థికి కలిసొచ్చాయి. అద్భుతమైన ఆరంభం లభించినా, భారత జట్టులో కనిపించిన ఉదాసీనత భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేసింది. భారత బ్యాటర్లు కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడంలో కూడా విఫలమై అనవసర ఒత్తిడిని కొనితెచ్చుకున్నారు. అయితే గాలిలో షాట్లు ఆడటం, లేదంటే మరీ డిఫెన్సివ్‌గా మారిపోవడంతో ఇన్నింగ్స్ ఎక్కడా కుదురుకోలేదు. దక్షిణాఫ్రికా చేతిలో కేవలం ఓడిపోవడమే కాదు, 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం భారత్ నెట్ రన్ రేట్‌ను (-3.800) అగాధంలోకి నెట్టేసింది. సొంతగడ్డపై సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సిన గడ్డు పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇకపై జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించడంతో పాటు, దక్షిణాఫ్రికా తన మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలని భారత్ కోరుకోవాలి. సమీకరణాలన్నీ కలిసి వస్తే తప్ప టీమ్‌ఇండియా ముందడుగు వేయడం కష్టమే.