రూ.800 లంచం తీసుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరవింద్ మోతీరామ్ సావంత్‌ను దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేవలం లంచం డబ్బును జప్తు చేసినంత మాత్రాన సరిపోదని, సదరు ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లు నిరూపించే బలమైన, కచ్చితమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టకపోతే నిందితుడిని దోషిగా తేల్చలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2006 ఆగస్టులో నవీ ముంబయిలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న సావంత్, ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యక్తి నుంచి అనుమతి లేని నిర్మాణ పత్రాల జారీ కోసం రూ.800 లంచం అడిగారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు 2006, ఆగస్టు 22న వల పన్ని నిందితుడిని పట్టుకున్నారు. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న ఆ రూ.800 నగదును సావంత్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, విచారణ (క్రాస్ ఎగ్జామినేషన్) సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో కీలక విషయాలను నిరూపించారు. ఫిర్యాదుదారు కోరిన సర్టిఫైడ్ పత్రాలను జారీ చేసే అంతిమ అధికారం క్లర్కు అయిన సావంత్‌కు లేదని, ఆర్‌ఓసీ భద్రపరిచే ఆ పత్రాలు అతనికి అందుబాటులో కూడా ఉండవని రుజువు చేశారు. దీంతో లంచం డిమాండ్ చేసినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో సుదీర్ఘ కాలం తర్వాత కోర్టు అతనికి విముక్తి కల్పించింది.