Current Date: 04 Jun, 2026

అత్తను తలపై ఎత్తుకుని కోడలు పాదయాత్ర.. ఆఖరి కోరిక!

అత్తగారిపై ఉన్న అమితమైన భక్తి, ప్రేమాభిమానాలను చాటుకుంటూ హరియాణాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్‌ చౌధరీ ఒక అపూర్వ సాహసయాత్రకు ఉపక్రమించారు. నడవలేని స్థితిలో ఉన్న తన 90 ఏళ్ల అత్తమ్మ చంద్రీదేవి ఆఖరి కోరిక తీర్చడమే ధ్యేయంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధురాలైన అత్తను ఒక ప్లాస్టిక్‌ టబ్బులో కూర్చోబెట్టుకుని, దానిని చేతులతో మోస్తూ ఏకంగా 260 కిలోమీటర్ల సుదీర్ఘ ఆధ్యాత్మిక పాదయాత్రకు కాజల్ శ్రీకారం చుట్టారు. ఈ సాహసయాత్రలో భాగంగా వారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, బృందావన్‌ సహా శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ ‘బ్రిజ్‌ పరిక్రమ’ యాత్రను కొనసాగిస్తున్నారు. హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి, 84 కోసుల (సుమారు 260 కి.మీ) దూరం ఉండే ఈ ఆధ్యాత్మిక పాదయాత్రను పూర్తి చేయడానికి సాధారణంగా 40 రోజుల సమయం పడుతుంది. కృష్ణుడి జన్మస్థలితో పాటు ఆయన బాల్యం, యవ్వన లీలలతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ ఈ యాత్రలో భక్తులు దర్శించుకుంటారు. "మా అత్తయ్య నన్ను కోడలిలా కాకుండా, సొంత బిడ్డలా ఆదరించింది.. ఆమె రుణం తీర్చుకోవడం నా కనీస ధర్మం" అంటూ కాజల్ చౌధరీ చేస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణం చూసి స్థానికులు అబ్బురపడుతున్నారు. అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త నిర్వచనంగా నిలుస్తున్న కాజల్‌కు, ఆమె వెళ్తున్న దారిపొడవునా వివిధ గ్రామాల్లో ప్రజలు హారతులు పడుతూ, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.