ఆడుకుంటూ ఆనందంగా గడపాల్సిన ఒక చిన్నారి ప్రాణం, ఒక చిన్న బెలూన్ కారణంగా అనంత వాయువుల్లో కలిసిపోయింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మంజుల శ్రీనివాసరావు, వెంకటరమణ దంపతుల చిన్న కుమార్తె శిరీష (4) ఉదయం తన అక్కతో కలిసి ఇంటి సమీపంలోని దుకాణంలో బెలూన్లు కొనుక్కుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఉత్సాహంగా బెలూన్ ఊదుతుండగా, అది అనుకోకుండా గొంతులోకి జారి శ్వాసనాళంలో ఇరుక్కుపోయింది. బెలూన్ అడ్డుపడటంతో చిన్నారికి శ్వాస ఆడక విలవిల్లాడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శిరీష మరణించింది. కూలి పనులు చేసుకుంటూ నలుగురు ఆడపిల్లలను సాకుతున్న ఆ పేద కుటుంబంలో ఈ ఘటన తీరని శోకాన్ని నింపింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్న కుమార్తె కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్న పిల్లలు బెలూన్లతో ఆడుకునేటప్పుడు ఎంతటి ప్రమాదం పొంచి ఉంటుందో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.