ఐపీఎల్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ, ఈ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. రజత్ పాటీదార్ అందుబాటులో లేకపోవడంతో వికెట్ కీపర్ జితేశ్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగిన బెంగళూరు.. మరో మ్యాచ్ మిగిలుండగానే 18 పాయింట్లతో ముందంజ వేసింది. మరోవైపు పంజాబ్ జట్టు వరుస ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకోగా.. ఆ జట్టు ముందంజ వేయాలంటే చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జాకబ్ బెతెల్ (11) త్వరగా అవుటైనా, విరాట్ కోహ్లి (58), దేవ్‌దత్ పడిక్కల్ (45) ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ (28) చెలరేగడంతో ఆర్సీబీ పరుగుల వరద పారించింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కడే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు 8 వికెట్లకు 199 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలోనే ప్రియాంశ్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్ (2)లను అవుట్ చేసి గట్టి దెబ్బ కొట్టగా, వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1)ను రసిఖ్ సలామ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కూపర్ కనోలీ (37), సూర్యాంశ్ షెడ్జే (35) కోలుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. చివర్లో శశాంక్ సింగ్ (56; 27 బంతుల్లో) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, హేజిల్‌వుడ్ కట్టుదిట్టమైన బౌలింగ్, రసిఖ్ సలామ్ ధాటికి పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.