టీ20 ప్రపంచకప్ విజయానందంలో ఉన్న క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ 19వ సీజన్ సిద్ధమైంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, విదేశీ ఆటగాళ్ల రాకలో ఇబ్బందులు, తమిళనాడు, అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం కేవలం మొదటి 20 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే వెల్లడించారు. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 12 వరకు సాగే ఈ తొలి దశలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియానికి ఒకే ఒక మ్యాచ్‌ను కేటాయించారు. మూడు పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసారి విశాఖపట్నం స్టేడియానికి మ్యాచ్‌లు కేటాయిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ తన హోమ్ గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ప్రారంభ వారాంతంలో సింగిల్ మ్యాచ్‌లు, ఆ తర్వాత శని, ఆదివారాల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గతేడాది ఆర్‌సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన కారణంగా చిన్నస్వామి స్టేడియంపై విధించిన నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. అయితే స్టేడియంలోని భద్రతా ఏర్పాట్లు, నిబంధనల అమలును నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి అనుమతులు లభించనున్నాయి. ప్రస్తుతం ఈ మైదానం ఆరంభ వేడుకలతో పాటు మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబవుతోంది.
Share