Current Date: 20 Aug, 2026

జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

చిన్నారి అచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో న్యాయవాది జి.శ్రీకాంత్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి కేసు విషయంలో పోలీసుల తీరును కోర్టు దృష్టికి శ్రీకాంత్ తీసుకువచ్చారు. నెలలు గడిచినా చిన్నారి అచూకీ కనిపెట్టలేదని పేర్కొన్నారు. మరోవైపు, పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపించారు. జ్ఞానేశ్వరి అచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. జ్ఞానేశ్వరి అదృశ్యానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో కేసు దర్యాప్తు నివేదికను సమర్పించారు. కాగా, జ్ఞానేశ్వరి అదృశ్యంతో బాధితురాలి కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. నిత్యం తమ కుమార్తె జ్ఞాపకాలు, వీడియోలను చూసుకుంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని వీలైనంత త్వరగా కాపాడి తమకు అప్పగించాలని కోరుతున్నారు.