తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమై పది రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిన్నారి అదృశ్యమైన తోట, కొండ ప్రాంతాలను అటవీ శాఖ, పోలీస్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర బలగాలు జల్లెడ పడుతున్నాయి. కానీ.. ఇప్పటివరకు ఒక్క క్లూ కూడా దొరకకపోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ జరిగినట్లు ఆధారాలు లేవని, కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే చిన్నారి తనకు తానుగా నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు. అడవి జంతువుల దాడి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. చిన్నారి వెంట వెళ్లి వచ్చిన పెంపుడు కుక్క డీహైడ్రేట్ అయిందని, దాని పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరికొన్ని వివరాలు తెలుస్తాయని ఎస్పీ చెప్పారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డును కూడా ప్రకటించారు. బిడ్డ దూరమై గుండెకోత అనుభవిస్తున్న తమపై సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలు, తప్పుడు వ్యాఖ్యలు ప్రచారం చేయడంపై చిన్నారి తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి బాధను అర్థం చేసుకుని సామాజిక మాధ్యమాల్లో లేనిపోని పుకార్లు సృష్టించవద్దని కన్నీటితో విజ్ఞప్తి చేశారు.