దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టుపైన అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై రాష్ట్రవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయని, ఇకపై ఈ పోస్టులపైన కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు ఆర్జీవీ. అయితే, ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను వాయిదా వేయాలని కోరడంతో ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల వేట కొనసాగుతోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలిస్తున్నారు. ఇక, సోషల్ మీడియా పోస్టుల కేసులో ఒకవైపు పోలీసులు వర్మ కోసం వెతుకుతూ ఉండగా, మరోవైపు వర్మ అజ్ఞాతంలో ఉంటూనే వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇస్తున్నారు. తాను కేసులకు భయపడటం లేదన్నారు. ఏడుస్తున్నానని, భయపడుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
Share