Current Date: 30 May, 2026

అత్తింటి వారు బైక్ కొనివ్వలేదని.. భార్యను చంపిన కొత్త అల్లుడు!

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి శివారులోని మామిడితోటలో ఘోరం జరిగింది. అత్తింటివారు ద్విచక్రవాహనం కొనివ్వలేదన్న కోపంతో దాసరి అంజయ్య (25) అనే వ్యక్తి తన భార్య యాదమ్మ (20)ను గదిలో ఉరేసి హత్య చేశాడు. అనంతరం పోలీసు కేసుకు భయపడి, ఘటనా స్థలానికి కొద్ది దూరంలో అతడు కూడా మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. మారేపల్లికి చెందిన అంజయ్యకు ఇటీవల యాదమ్మతో వివాహమైంది. వీరు మారేపల్లి శివారులో ఓ మామిడితోటను కౌలుకు తీసుకుని, అక్కడే నివాసముంటూ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, మద్యానికి బానిసైన అంజయ్య బైక్ కొనివ్వాలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఉదయం తల్లి పండ్లు అమ్మడానికి బయటకు వెళ్లిన సమయంలో భార్యాభర్తల మధ్య మళ్లీ వివాదం రేగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఒక్క రోజే భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన వ్యక్తికి బైక్ కొనిస్తే దాన్ని ఎక్కడ తాకట్టు పెట్టేస్తాడేమోనని.. అత్తింటివారు బైక్ కొనివ్వకుండా కాలయాపన చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ వాళ్లు కన్నీరుమున్నీరు అయ్యారు.